పాతికేళ్ళ పండగ
సెప్టెంబరు 30-అక్టోబరు 1, 2023
Saint Toma Church, 25600 Drake Rd, Farmington Hills, MI 48335
1998 లో ప్రారంభమైన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (Detroit Telugu Literary Club) కి పాతికేళ్ళు నిండుతున్నాయి. తెలుగు పుస్తకాలు అందరూ కలిసి చదవడం కోసం, వాటిపై అభిప్రాయాలను తర్కించుకోవడం కోసం ఏర్పరచుకున్న సంస్థకు ఈ పాతిక సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆప్తులయ్యారు. ఆడంబరమైన పండగల అవసరమైతే లేదుగానీ, ఏర్పరచుకున్న ఆశయాలను ఇన్నేళ్ళుగా నిలబెట్టుకోగలిగినందుకు ఆప్తులతో కలిసి అనుభవాలను నెమరువేసుకుంటూ రాబోయే తరాన్ని తెలుగు సాహిత్యానికి మరింత దగ్గర చేసే ప్రయత్నమే ఈ పండగ ఆశయం. తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ పాతికేళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్ కు ఆహ్వానిస్తున్నాం.
రెండు రోజుల పాటు (సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీలు, శని-ఆది వారాలు) జరిగే సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు
1. ’ప్రవాస జీవితంలో తెలుగు సాహిత్యంతో అనుభవాలు’.
2. ‘కొత్త తరానికి తెలుగు సాహిత్యంతో అనుబంధం పెంపొందించే అవకాశాలు’.
దూరమైనకొలదీ పెరిగే అనురాగం ప్రవాసంలో మనకున్న తెలుగు భాషాభిమానానికి ఒక ముఖ్యకారణం. ప్రవాసులు కాకముందు నుంచీ తెలుగు సాహిత్యాన్ని అభిమానించినవారు, సాహిత్యంతో సన్నిహిత సంబంధం ఉన్నవారూ లేకపోలేదుగానీ, అధికభాగ ప్రవాసులు మాత్రం ప్రవాసంలో తెలుగు సాహిత్యం మీద మమకారం పెంచుకున్నవారే. భాషకు సంస్కృతికీ ఉన్న అవినాభావ సంబంధం కారణంగానే అనేక భాషా ప్రాతిపదిక సంఘాలూ ఏర్పాటయ్యాయి. ఆయా సంఘాల్లో భాషకున్న స్థానాన్ని ప్రశ్నించవలసి వచ్చినా, భాషపై మక్కువను అనుమానించలేం. ‘సాహిత్య’మనేది పెద్ద మాటగా తోచినా తెలుగు మాటను, తెలుగు పుస్తకాన్ని ప్రవాసంలో మరుగున పడెయ్యటానికి ఇష్టపడని భాషాభిమానుల అనుభవాల సమాహారం ఈ చర్చ ఆశయం.
ప్రవాసుల్లో తెలుగు మాట్లాడేవారు, చదివేవారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మొదటి తరం తెలుగువారు. తెలుగు సంఘాల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేదీ వారే. రెండవ తరం వారికి తెలుగు అర్ధమైనా, అరకొరగా చదవడం రాయడం తెలిసినా కాలేజి చదువులనాటికి మరుగున పడిపోతాయి. డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితుల వంటి సంస్థల సాహిత్య గోష్టుల్లో పాల్గొనేవారు కూడా మొదటి తరం ప్రవాసులే. కాలక్రమేణా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో తెలుగు నేర్వడం తగ్గుతున్న దృష్ట్యా, ప్రవాసులైన తెలుగు యువతలోని భాషాభిమానాన్ని తెలుగు సాహిత్యంవైపు మొగ్గు చూపించేలా మళ్ళించగలిగితే భాషను నిలుపుకోగలిగే అవకాశం పెరుగుగుతుంది. ఈ పనిలో భాషాప్రాతిపదికన ఏర్పరుకున్న సంఘాల, సాహితీ సంస్థల ఆవశ్యకతను, బాధ్యతలను చర్చించడం రెండవ అంశం ఆశయం.
ఈ రెండు అంశాల్లోని ఆశయాలను ప్రతిబింబించే విధంగా ఏదో ఒక నిర్దిష్టమైన విషయంపై 13 నిమిషాలకు మించకుండా ఉపన్యాసించడానికి రావలసిందిగా సాహితీ మిత్రులను కోరుతున్నాం. ప్రసంగించదలుచుకున్న వారు ప్రసంగ సంగ్రహాన్ని (200 మాటలకు మించకుండా) జులై 31, 2023 లోగా మాకు పంపితే సదస్సు కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉంటుంది. సదస్సులో ప్రసంగించడానికి ఎన్నుకోబడిన వారు, ఆగష్టు 30, 2023 లోగా తమ ప్రసంగం పూర్తి పాఠాన్ని పంపితే సదస్సుకు ముందుగానే జ్ఞాపిక సంచికలో ప్రచురించి సదస్సులో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సదస్సుల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతా, రుసుమూ అవసరం లేదు. సదస్సుకు డిట్రాయిట్ రమ్మని ఆహ్వానించడం తేలికే గానీ ఉత్తర అమెరికాలోనే ఉన్న వారికైనా ప్రయాణం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ వచ్చిన వారికి అతిధి మర్యాదలు చేయగలమేగానీ ప్రయాణ ఖర్చులైతే పెట్టుకోలేం. గతంలో ఈ సాహితీ సమితి పదవ, ఇరవైయ్యవ వార్షికోత్సవాలకు ఏర్పాటు చేసినట్టుగానే సభ్యుల ఇళ్ళల్లో నివాస వసతి వీలైనంతలో ఏర్పాటు చెయ్యగలం. రెండు రోజులూ భోజన సదుపాయాల బాధ్యతా మాదే. రాదలుచుకున్నవారు మాత్రం ఆగష్టు 31, 2018 లోగా మాకు తెలియజెయ్యమని మనవి. విందు కార్యక్రమంలో భాగంగా స్వీయ రచనా (మూడు నిమిషాలకు మించని కవిత, కథ) పఠనం కూడా ఉంటుంది. స్వీయ రచనా పఠనం చెయ్యదల్చుకున్నవారు సెప్టెంబరు 10, 2023 లోగా తెలియజేస్తే కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉంటుంది. అన్ని వివరాలకు dtlcgroup@gmail.com కు ఈమెయిల్ చెయ్యండి. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.
సదస్సులో పాల్గొనడానికి పేరు నమోదు చెయ్యడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1, 2023 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది)
సదస్సులు జరిగే సమయం: సెప్టెంబరు 30, శనివారం, ఉదయం 10 గంటల నుండి అక్టోబరు 1, ఆదివారం, మధ్యాహ్నం 3 గంటల వరకు.
స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ: సెప్టెంబరు 10, 2023
DETROIT TELUGU LITERARY CLUB (డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్)